హమ్మయ్య భగవాన్ బదిలీకి బ్రేక్.. విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవ్..

గురువారం, 28 జూన్ 2018 (11:36 IST)
నాలుగేళ్ల పాటు తమకు పాఠాలు చెప్పిన గురువు బదిలీపై వెళ్లడాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన్ని వెళ్ళొద్దని అడ్డుకున్నారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాట సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా ఈ వార్తకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
 
తమిళనాడులోని తిరువళ్లూరులోని వలైగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భగవాన్ అనే ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ లెక్చరర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వ బదిలీల్లో భాగంగా భగవాన్ వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆయనను వెళ్లొద్దంటూ బతిమాలాడారు. 2014లో ఉద్యోగం వచ్చిన దగ్గరి నుంచి ఇక్కడి విద్యార్థులతో ఉపాధ్యాయుడిలా కాకుండా అన్నయ్యలా, స్నేహితుడిలా ఉండేవాడినని.. అందుకే విద్యార్థులు ఇంత ప్రేమ చూపిస్తున్నారని భగవాన్ వెల్లడించాడు.
 
ఈ నేపథ్యంలో విద్యార్థుల పోరాటానికి ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం దిగొచ్చింది. తిరువళ్లూరు జిల్లా వెల్లియగరం గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని ఆంగ్ల ఉపాధ్యాయుడు భగవాన్ బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భగవాన్ మాస్టారును పిల్లలు పట్టుకుని బతిమాలుతున్న దృశ్యాలు, ఆయన బదిలీని తట్టుకోలేక ఏడుస్తున్న విద్యార్థుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
దీంతో కదిలిపోయిన విద్యాశాఖ భగవాన్ మాస్టారి బదిలీని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విషయం తెలిసిన విద్యార్థులు, తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అంతేగాకుండా భగవాన్ కూడా తన విద్యార్థులకు దూరమయ్యే బాధ నుంచి గట్టెక్కానని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు