ఆ రోజు నువ్వు గాడిదలు కాశావా బాబూ? తెలంగాణలో వేలు పెట్టను: జగన్
గురువారం, 8 జులై 2021 (15:45 IST)
చంద్రబాబూ... నువ్వు ఇపుడు మాట్లాడుతున్నావ్. అయ్యా, నువు సీఎంగా ఉన్నపుడు, దిండి, రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టులు కడుతుంటే, ఏం గాడిదలు కాశావు బాబూ అంటూ... అంటూ ఏపీ సీఎం జగన్ ఘాటుగా బదులిచ్చారు. జల వివాదాలను చూపి రాజకీయాలు చేస్తున్న పరిస్థితులను చూసి తాను ఇలా మాట్లాడాల్సి వస్తోందని సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానమిచ్చారు.
అనంతపురంలోని రాయదుర్గం రైతు దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. జల వివాదంపై ఆయన సవివరంగా వివరణ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్నపుడు, రాయలసీమ, కోస్త్రాంధ్ర, తెలంగాణాలకు నీటి విభజనను కృష్ణా జలాలపై లెక్కలు వేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణా, ఆంధ్ర, కేంద్రం ముగ్గురు 2015 జూన్ 19న కూర్చుని జల కేటాయింపులపై సంతకాలు చేశారు.
రాయలసీమకు 144 టిఎంసీలు, 367 టిఎంసీలు కోస్తా, 298 టీఎంసీలు తెలంగాణాకు కలిపి మొత్తం 811 టి.ఎసీలు బ్రేకప్ సంతకాలు చేశారు. రాయలసీమకు పోతిరెడ్డి పాడు ద్వారా నీరు రావాలంటే, 881 అడుగులు కనీసం నీటి మట్టం దాటాల్సి ఉంది. 88ల అడుగుల పైచిలుకు గత 20 ఏళ్ళుగా రాలేదు. 881 అడుగులు నీటి మట్టం కనీసం 20 రోజులు కూడా శ్రీశైలంలో లేవు. 881 అడుగులు ఉంటే తప్ప ఫుల్ డిస్చార్జ్ చేయలేం.
కానీ, తెలంగాణా ప్రాజెక్టులు పాలమూరు, కల్వకుర్తి అన్నీ 800 లోపే నీరు తీసుకుంటున్నారు. కరెంటు కూడా తెలంగాణా జనరేట్ చేస్తున్నారు. మేము కూడా 800 అడుగుల నీటి మట్టంతో రాయలసీమ లిఫ్ట్ చేసి, మా కేటాయింపులు మేం వాడుకుంటే తప్పేంటని సీఎం ప్రశ్నించారు.
ఇపుడు మన నీటిని మనం సద్వినియోగం చేసుకుంటున్నపుడు, ప్రతిపక్ష నేత ఈ రోజు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. జగన్ గాని, వైసీపీగాని కోరుకునేది ఒకటే... ఏ పక్క రాష్ట్రంతోనూ విభేదాలు వద్దు. పాలకుల మధ్య సఖ్యతే ఉండాలని మనసారా జగన్ కోరుకుంటున్నాడు.
అందుకే, తెలంగాణా రాజకీయాల్లో జగన్ వేలు పెట్టలేదు. కర్నాటక రాజకీయాల్లో జగన్ వేలు పెట్టలేదు. తమిళనాడు రాజకీయాల్లో జగన్ వేలు పెట్టలేదు.... ఇక ముందు కూడా వేలు పెట్టడు అని చెపుతున్నా. దేముడి దయతో ఈ ఏడాది కూడా మంచి వర్షాలు పడాలని కోరుకుంటున్నా అని జగన్ స్పష్టం చేశారు.