ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూడాల వినూత్న నిరసన

ఆదివారం, 15 నవంబరు 2009 (15:48 IST)
తమకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ వైద్యులు గత కొద్ది రోజులుగా నిరసనలు, నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం విదితమే. ఆదివారం నాడు వినూత్నంగా శాంతియుతంగా రక్తదానం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జూనియర్ వైద్యలు కొందరు మాట్లాడుతూ... తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత పంథాలో రక్తదానం చేసి, ఆ రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేసామని అన్నారు.

తాము దానం చేసిన రక్తాన్ని డెంగ్యూ వ్యాధితో బాధపడేవారికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని జూనియర్ వైద్యులు తెలిపారు.

రక్తదానం చేసిన అనంతరం వారు మంత్రి పితాని దిష్టిబొమ్మను దగ్దం చేశారు. తాము శాంతియుతంగానే ప్రభుత్వంతో పోరాడుతున్నామని, ఇకపై మరిన్ని ఆందోళనలు చేస్తేమని, తమది న్యాయమైన పోరాటమని వారు పేర్కొన్నారు.

ఇదిలావుండగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జూనియర్ వైద్యుల ఆందోళనకు మద్దతుగా పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తమ మద్దతును తెలిపాయి.

కాగా ప్రముఖ విద్యావేత్త, ఎంఎల్‌‍‌సి, చుక్కా రామయ్య హైదరాబాద్‌లో జూనియర్ వైద్యులను కలుసుకుని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూనియర్ వైద్యులు తమను పిలవకపోయినప్పటికీ తానే స్వయంగా వారి వద్దకు వచ్చి మద్దతు తెలుపుతున్నానని ఆయన అన్నారు.

వారు చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కారణాలు సరైనవేనని, దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి జూనియర్ వైద్యులకు తగు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

వెబ్దునియా పై చదవండి