తాను తన భర్త విడిపోవడానికి డబ్బు, హోదా వంటివి కారణం కాదని తాము విడిపోవడానికి మూడో వ్యక్తే కారణమని హీరో రవి మోహన్ భార్య ఆర్తి రవి తాజాగా ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ జీవితంలో తలెత్తిన విభేదాలకు, విడిపోవడానికి మూడో వ్యక్తే కారణమని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలకు తమ వద్ద బలమైన ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు.
నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి కొంతకాలంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్తి తాజాగా మరో పోస్ట్ ద్వారా తమ మధ్య మనస్పర్థలకు, తాము విడిపోవాలనుకోవడానికి డబ్బు, అధికారం వంటివి ఎంతమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. తమ బంధం దెబ్బతినడానికి మూడో వ్యక్తి కారణమని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని కేవలం ఊహించి చెప్పడం లేదని, దీనికి సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆర్తి తన పోస్ట్ పేర్కొన్నారు.
కొంతకాలంగా జయం రవి, గాయని కెనీషా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక వివాహ వేడుకకు హాజరుకావడం, ఆ సందర్భంలోని ఫోటోలు బయటకు రావడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆర్తి స్పందిస్తూ, తీవ్ర ఆవేదనతో కూడిన పోస్టున్ను షేర్ చేశారు.
గత సంవత్సరం జయం రవి తాను తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన చేసే ముందు తనను సంప్రదించలేదని, తన అభిప్రాయం తీసుకోకుండానే ఏకపక్షంగా విడాకుల విషయాన్ని వెల్లడించారని ఆర్తి ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువురూ గత ఏడాదే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో విచారణ దశలో ఉంది.