తెదేపాలో చిచ్చురేపిన పునర్‌వ్యవస్థీకరణ : వైకాపాలోకి 15 మంది జంప్

ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (12:05 IST)
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపింది. మంత్రి పదవులు దక్కని పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. వీరిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా, మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటివారిలో బొండా ఉమామహేశ్వర రావు కూడా ఉన్నారు. దీంతో ఆయనను మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని నానిలు బుజ్జగిస్తున్నారు. 
 
అలాగే, కాంగ్రెస్ నుంచి వచ్చిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో టీడీపీపై కేసులు పెట్టిన వ్యక్తికి ఇప్పుడు మంత్రి పదవిని ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయన, ఈ చర్యతో జిల్లాలో తెలుగుదేశం నేతల పరువు పోయిందని తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించారు. ఇప్పటికే తన రాజీనామాపై కార్యకర్తలతో చింతమనేని చర్చలు సాగించినట్టు సమాచారం. 
 
మంత్రి వర్గ విస్తరణ తర్వాత అసంతృప్తుల సంఖ్య పెరుగుతూ ఉండటం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామమేనని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. బహిరంగంగా తమ అసంతృప్తులను వ్యక్తం చేస్తున్న వారే కాకుండా, ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైకాపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరంతా ఇప్పటికే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. 
 

వెబ్దునియా పై చదవండి