వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అధికార పక్షం నేతలు అసెంబ్లీలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చివరికి సొంత పార్టీ నుంచి టీడీపీకి జంప్ అయిన నేతలు కూడా జగన్‌ను ఆటాడుకుంటున్నారు. ఈ క్రమంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ప్రస్తుత శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి జగన్‌పై సెటైర్లు విసిరారు. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో వచ్చాక అన్నీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
జగన్‌ను ఏదడిగినా మూడేళ్లు అంటారని.., రేషన్, పెన్షన్,.. ఇలా దేని గురించి మాట్లాడినా మూడేళ్లు ఆగాలని చెప్పేవాడని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. చివరికి ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్‌కు సాయం చేయాలన్నా మూడేళ్లు ఆగాలంటాడని సెటైర్ వేశారు. ఆయన శవానికి సాయం చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. చివరికి భార్యాభర్తలు విడిపోయినా.. పంచాయతీ చేయమని పిలిచినా అదే మాట మూడేళ్ల తర్వాత చేస్తానని చెప్పేవారని కామెంట్స్ చేశారు.
జగన్‌కు వయస్సు తక్కువ ఆశ ఎక్కువని ఆదినారాయణరెడ్డి అన్నారు. జగన్‌కు డబ్బు మీద యావ, పదవిపై మోజు తప్ప మరేం లేదని దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా.. ఆయనను వారు నమ్మరని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు పురోగతిలో వెళ్తుంటే జగన్ అధోగతిలో ఉన్నారని విమర్శించారు. వైఎస్ కుటుంబం వందలాది హత్యలు చేయించిందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.
సీఎం పోస్టును చందమామ కథలా జగన్ మార్చేశారని, ఆయన సీఎం అయ్యేది లేదు.. కామన్ మాన్ సపోర్ట్ ఆయనకు లేదని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పనికిరారని.. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సభ నుంచి బయటికి పంపాలన్నారు. ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడకుండా.. అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీలో చేరామని వెల్లడించారు.
మరోవైపు వైకాపా నేతను చినబాబు నారాలోకేష్ కూడా టార్గెట్ చేశారు. అసెంబ్లీలో విలువైన సమయాన్ని జగన్మోహన్ రెడ్డి వృధా చేస్తున్నారని, జగన్‌కు ఇతరులపై బురదజల్లి పారిపోవడం అలవాటుగా మారిందని నారా లోకేష్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ చేసేందుకేనని స్పష్టం చేశారు. జగన్‌కు దమ్ముంటే తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాలు విసిరారు.