ఎంపీ వంగా గీత ఇంటి ముందు అగ్రిగోల్డ్ బాధితుల ధ‌ర్నా

శుక్రవారం, 16 జులై 2021 (17:05 IST)
ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చి... ఇపుడు అగ్రిగోల్డ్ బాధితుల‌ను గాలికి వ‌దిలేశార‌ని సిపిఐ నాయ‌కులు విమ‌ర్శించారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అగ్రి గోల్డ్ బాధితులకు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తానని హామీ ఇచ్చి, ముఖ్యమంత్రి అయిన తర్వాత వారందరినీ నట్టేట ముంచారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య విమర్శించారు.
 
గురువారం స్థానిక కాకినాడ ఎంపీ వంగా గీత నివాసం వద్ద అగ్రి గోల్డ్ భాదితులు ధర్నా చేసారు. అగ్రి గోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకత్వంలో వినతి పత్రాన్ని అందజేశారు .
 
2021 ఆగస్టులో అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభించలేదని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గత మార్చి 31లోగా సిఐడి పోలీస్ బృందాలతో బాండ్లు పరిశీలన నేటికీ ప్రారంభం కాలేదన్నారు. బడ్జెట్లో 200 కోట్లు కేటాయించినా, ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని బాధితులు పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల క్యాలెండర్లు అన్ని వాగ్దానాలు అమలు చేస్తున్న సీఎం, అగ్రి గోల్డ్ బాధితుల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న‌, గుండెపోటుతో మరణించిన బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అని చెప్పిన వాగ్దానం ఏ ఒక్కరికి అమలు చేయలేదని రావుల వెంకయ్య విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఆందోళన తీవ్రం చేస్తామని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్, లోవ రత్నం, అగ్రిగోల్డ్ నాయకులూ శ్రీను రాంబాబాబు, విరవేణి, బేబిరాజ్, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు