దీంతో ఈరోజు ఉదయం టోకెన్లను తీసుకున్న అమరావతి రైతులు అలిపిరి పాదాల మండపం నుంచి గోవింద నామస్మరణలు చేసుకుంటూ తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. సగంమంది కాలినడకన వెళితే మరికొంతమంది మాత్రం సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్ళారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 120 మంది చొప్పున రాత్రి 8 గంటల వరకు 850 మంది శ్రీవారిని దర్సించుకుంటున్నారు. మొదట్లో టిటిడి ధర్మకర్తలమండలి వెనుకడుగు వేసింది. అసలు శ్రీవారిని దర్సించుకుంటామా అన్న అనుమానం చాలామందిలో నెలకొంది. కానీ చివరకు పాదయాత్రగా వచ్చిన రైతులకు దర్సనభాగ్యం కల్పించకపోతే విమర్సల పాలవుతామని భావించిన టిటిడి ఛైర్మన్ రైతులకు టోకెన్లను మంజూరు చేశారు.
అయితే మొదటిరోజు సగం, మరుసటి రోజు మరోసగం టోకెన్లను ఇవ్వాలని భావించారు. కానీ ఒకేరోజు దర్సనం కల్పిస్తే సరిపోతుందన్న భావనతో ఈరోజే టోకెన్లన్నింటినీ మంజూరు చేసేశారు. దీంతో ఎంతో సంతోషంతో అమరావతి రైతులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు.