విజయవాడ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీఎం చంద్రబాబు

ఠాగూర్

సోమవారం, 2 సెప్టెంబరు 2024 (10:16 IST)
విజయాడలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం రాత్రి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు స్వయంగా ఆహారం అంజేశారు. ఆయన బాధితుల పరిస్థితి చూసి చలించిపోయారు. ఆ తర్వాత ఆయన విజయవాడ కలెక్టరేట్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. 
 
ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేపు కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. తద్వారా రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు.
 
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు వస్తోందని వివరించారు. మున్నేరు, బుడమేరు నుంచి కూడా భారీగా నీరు వస్తోందని చెప్పారు. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీళ్లు విజయవాడకు వచ్చాయని వెల్లడించారు. బుడమేరు నిర్వహణను వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాటు పట్టించుకోకపోవడమే దీనికి కారణం అని చంద్రబాబు మండిపడ్డారు.
 
వరద బాధితులు సుమారు 2.76 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేశారు. ఇవాళ సింగ్ నగర్ లో వరద బాధితుల కష్టాలను స్వయంగా చూశానని తెలిపారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించాలని ఆదేశించానని పేర్కొన్నారు.
 
రాష్ట్రానికి రేపు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 40 పవర్ బోట్లు, 6 హెలికాప్టర్లు వస్తున్నాయని వెల్లడించారు. సహాయ చర్యల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మోహరించామని అన్నారు. సహాయ చర్యలను రాత్రిపూట కూడా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, సమాచారం కోసం కమాండ్ కంట్రోల్ నెంబర్లు 112, 107 అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు