పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌కు అంకితం చేస్తాం: సీఎం జగన్

మంగళవారం, 22 మార్చి 2022 (19:17 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టును ఉక్కు సంకల్పంతో నిర్మిస్తామని.. కేంద్రం సహకారంతో ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. 
 
అంతేకాదు పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌కు (వైఎస్ రాజశేఖర్ రెడ్డికి) అంకితం చేస్తామని సీఎం సభలో ప్రటకటన చేశారు. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్సార్‌ ప్రారంభించారని ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేసి తీరుతానని సీఎం వైఎస్‌ జగన్‌ సభలో పేర్కొన్నారు.
 
పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో చంద్రబాబు నాయుడు మానవ తప్పిదం చేశారని  జగన్  ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగిన సుదీర్ఘ చర్చలో సీఎం సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ కు14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేశారన్నారు. 
 
పోలవరం ఇప్పటి వరకు పూర్తి కాలేదు అంటే.. చంద్రబాబు చేసిన పనులే శాపంగా మారాయన్నారు. స్పిల్‌వే కట్టడంలో బాబుది అతిపెద్ద మానవ తప్పిదం అంటూ విమర్శించారు. అసలు స్పిల్‌వే పూర్తిచేయకుండానే కాఫర్‌డ్యామ్స్‌ కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పిల్‌వే పూర్తిచేయలేదు, కాఫర్‌డ్యామ్‌ మధ్యలోనే ఆపేశారని ఆరోపించారు.
 
విపక్షాలు, మీడియా ప్రచారం చేస్తున్నట్టు పోలవరం ఎత్తు ఒక్క ఇంచ్ కూడా తగ్గదని జగన్ హామీ ఇచ్చారు  2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు