ఈ మండలంలోని ఆకవీడు గ్రామానికి చెందిన ఎలిజబెత్‌రాణి (28) అనే యువతిని యడవల్లికి చెందిన జవాను బైళ్ల సాల్మన్ అలియాస్ చెన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరి వివాహం 11 యేళ్ళ క్రితం జరిగింది. సాల్మన్ జమ్ములోని ఆర్మీ- నాగియా ట్రాన్సిక్షన్ విభాగంలో జవానుగా పనిచేస్తున్నాడు. వీరు హైదరాబాద్ తిరుమలగిరి క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు.
ఈక్రమంలో సాల్మన్ తన తండ్రి సంవత్సరీకం నిర్వహించడానికి వారం రోజుల క్రితం సెలవు పెట్టాడు. భార్య, కుమార్తెతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి జ్ఞాపకార్థ కార్యక్రమాన్ని ఘనంగానే నిర్వహించాడు. అయితే సంపాదించిన డబ్బులు ఇలా వృధాగా ఖర్చు చేయవద్దంటూ భార్య ఎలిజబెత్‌రాణి చెప్పింది. ఇది వారిద్దరి మధ్య గొడవకు దారితీసింది.
అసలే తాగివున్న సాల్మాన్... ఇంట్లో ఉన్న ఇనుప రాడ్‌తో భార్య తలపై కొట్టడంతో ఎలిజబెత్‌రాణి కిందపడిపోయింది. అప్పటికీ కోపం చల్లారక సాల్మన్ ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించగా శరీరం పూర్తిగా కాలిపోయి అక్కడే ప్రాణాలు విడిచింది. అయితే తన భార్య బుధవారం రాత్రి భార్య విద్యుదాఘాతంతో మృతి చెందిందని సాల్మన్ గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు... అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం శవపంచనామా నిర్వహించారు. ఇందులో తలకు బలమైన గాయం తగిలివుందని, పైగా కిరోసిన్ పోసి తగులబెట్టినట్టుగా ఉందని పోస్టుమార్ట్ రిపోర్టులో తేలింది. దీంతో సాల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.