వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఠాగూర్

శుక్రవారం, 29 నవంబరు 2024 (16:07 IST)
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 సీట్లు అన్న వైకాపా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేసినప్పటికీ ఆయనలో మాత్రం మార్పు రాలేదని జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రజలకు జగన్ కొన్ని పథకాలు ఇచ్చారని... ఆ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాతో జగన్ ఉన్నారని... అదేసమయంలో కార్యకర్తలను విస్మరించారని, వారిని పక్కన పెట్టేశారని... వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమన్నారు. అందుకే వైనాట్ 175, వైనాట్ కుప్పం నుంచి... చివరకు 11 సీట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్‌లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కార్యకర్తలను బాగా చూసుకుంటాననే ఒక్క మాట కూడా ఆయన నుంచి రాలేదని విమర్శించారు.
 
ప్రజలు తప్పు చేశారనే విధంగా జగన్ మాట్లాడుతున్నారని... ప్రజలు ఎందుకు తప్పు చేస్తారని బాలినేని ప్రశ్నించారు. నువ్వు తప్పు చేస్తే... ప్రజలు కూడా తప్పు చేస్తారని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో నాలుగు సార్లు, ఐదు సార్లు సీఎంగా ఉన్నవారు ఉన్నారని... వాళ్లెందుకు అన్ని సార్లు సీఎం అయ్యారని ప్రశ్నించారు. నువ్వు మంచి చేస్తే ఎందుకు ఓడిపోతావని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్‌కు వెళ్లారనే అక్కసుతో మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు దాదాపు 17 మందికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పార్టీ ఇచ్చారని.. ఆ పార్టీకి వెళ్లినవారికి జగన్ ఎంపీ టికెట్లు ఇవ్వలేదని గుర్తుచేశారు. 
 
తన గన్‌మెన్లను సరెండర్ చేసి, 'నాకు అది చేయలేదు ఇది చేయలేదు' అని చెప్పినా తనను వైసీపీ నుంచి తీసేయలేదని... తీసేసి ఉంటే వేరే పార్టీ తరపున పోటీ చేసి ఇపుడు మంత్రి అయ్యుండేవాడినని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో మాట్లాడానని... ఆయన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమేకాకుండా మంత్రిని కూడా చేస్తానని చెప్పారని వెల్లడించారు.
 
విజయమ్మ, షర్మిలతో పాటు ఇతరులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తున్న అంశంపై జగన్ మాట్లాడుతూ... మా వాళ్లను అరెస్టు చేస్తారా? మళ్లీ నేనే సీఎం అవుతాను... మీ అందరి సంగతి చూస్తానంటూ పోలీసులను, అధికారులను బెదిరిస్తున్నారని... జగన్ మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు బాలినేని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆయనను ప్రజలు నమ్మాలి కదా? అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు