సీఎం జగన్ రెడ్డి సోదరులు వైవీ విక్రాంత్‌రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి బాక్సైట్ తవ్వకాలతో 15 వేల కోట్లు సంపాదించనున్నారని వారి రైట్‌హ్యాండ్ లవకుమార్‌రెడ్డి ఆడియో లీక్ కావడం, మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో టిడిపి బృందం నిజనిర్దారణకి రౌతుల పూడి చేరుకుంది. అయితే టిడిపి బృందాన్ని కోవిడ్ నిబంధనలు పేరుతో పోలీసులు అడ్డుకున్నారు.
టిడిపి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా పోలీసుల తీరుకి నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు. టిడిపి నేతల్ని పరామర్శించేందుకు ఫోన్ చేసిన నారా లోకేష్ ``టిడిపి నేతల్ని అడ్డుకోవడం ద్వారా మైనింగ్ మాఫియాకి ఖాకీలు అండగా నిలిచారు`` అని రుజువైందన్నారు.
జగన్‌రెడ్డి గనుల తవ్వకపు మాఫియాలో ఘనుడని.. తన వారిని రంగంలోకి దించి అభయారణ్యంలో పచ్చనిచెట్లు నరికివేయించి, లేటరైట్ ముసుగులో బాక్సైట్ మైనింగ్ చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. బాక్సైట్ రెడ్డి తనకి దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్‌రెడ్డిని మించిపోయే విధంగా తన బంధువులైన వైవీ విక్రాంత్‌రెడ్డి, వైఎస్ అనిల్రెడ్డిలతో మైనింగ్ మాఫియా పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.
టిడిపి నేతల్ని చెట్లు నరికి రోడ్డు వేసిన ప్రాంతం, బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ద్వారా అక్కడ మైనింగ్ మాఫియా కార్యకలాపాలు ఉన్నాయనే ఒప్పుకున్నట్టయ్యిందని నేతలకు వివరించారు. గిరిజనుల హక్కుల్ని కాలరాస్తోన్న బాక్సైట్ రెడ్డి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోరాటం సాగించాలని నేతలకు సూచించారు.
రిజర్వ్ ఫారెస్ట్‌ని ధ్వంసం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తూ, గిరిజనుల హక్కులపై ఉక్కుపాదం మోపుతూ చెలరేగిపోతున్న ప్రభుత్వ ప్రాయోజిత మైనింగ్ మాఫియాని తరిమికొట్టేవరకూ స్థానికులతో కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.