భూమా నాగిరెడ్డికి గుండెపోటు.. తీవ్ర అస్వస్థత... పరిస్థితి అత్యంత విషమం?

ఆదివారం, 12 మార్చి 2017 (11:21 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ఫలితంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. 
 
గుండెపోటుకు గురైన వెంటనే భూమా నాగిరెడ్డిని ఆళ్ళగడ్డలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేశారు. మెరుగైన వైద్యం అందించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 
 
ఇదిలావుంటే భూమాకు గుండెపోటు రావడం ఇదేం మొదటిసారి కాదు. బైపాస్ సర్జరీ చేసుకున్న భూమాకు గతంలో రెండుసార్లు భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చింది. అయితే సకాలంలో మెరుగైన వైద్యం అందడంతో ఆయన కోలుకున్నారు. ఆయన గుండెపోటు వార్త విన్న కుటుంబసభ్యులు, అనుచరులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. 
 
నంద్యాల ఆస్పత్రికి భూమా అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. అహోబిలం నుంచి హుటాహుటిన నంద్యాలకు అఖిల ప్రియ బయల్దేరారు. కాసేపట్లో భూమానాగిరెడ్డి పరిస్థితిని డాక్టర్లు వివరించనున్నారు. భూమా నాగిరెడ్డి ఆరోగ్యంపై వైద్యులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ, భూమాకు అత్యంత సన్నిహితులు మాత్రం కన్నీరుమున్నీరవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి