నిజానికి ఈ షార్ సెంటర్ నుంచి అనేక ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. వీటిని ప్రత్యక్షంగా వీక్షించాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ, ఆ అవకాశం అతికొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. అయితే, ఈ నెల 12వ తేదీ నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో ఉన్న సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుంచి ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ ప్రయోగాన్ని మాత్రం పది వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేలా చర్యలు తీసుకుంది.
ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున 2.51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు 10 వేల మంది ప్రజలకు ఇస్రో అవకాశం కల్పించింది. ఈ నెల 4వ తేదీ గురువారం అర్థరాత్రి (00.00 గంటలు) నుంచి ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు ఇస్రో వెబ్‌సైట్ www.isro.gov.inలో వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇవ్వనున్నట్టు ఇస్రో ప్రకటించింది.