చంద్రబాబు అరెస్టు : స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న మంత్రి రోజా

సోమవారం, 11 సెప్టెంబరు 2023 (10:15 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అధికార వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా, ఏపీ పర్యాటక మంత్రి, వైకాపా మహిళా నేత, సినీ నటి ఆర్కే రోజా అయితే ఏకంగా స్వీట్లు పంచిపెట్టి, బాణాసంచా కాల్చిమరీ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ నేతలు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు కూడా ఇకనుంచి రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనంటూ హెచ్చరికలు జారీచేశారు. పైగా, ప్రజలను చంద్రబాబు రెచ్చగొట్టడం మానుకోవాలంటూ మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు హితవు పలికారు. 
 
ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో గత రాత్రి రిమాండ్‌కు పంపంపారు. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు, శ్రేణులు రోడ్లపైకి వచ్చి భారీ మోతాదులో బాణాసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. మంత్రి రోజా అయితే ఒక అడుగు ముందుకేసి... నగరిలోని తన నివాసంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన తప్పులన్నింటికీ రిటర్న్ గిఫ్ట్‌ వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, లోకేశ్ కూడా రోజులు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 
అలాగే, ఏపీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు ఆరోపణలపై ఆధారాలు ఉండటం వల్లే కోర్టు రిమాండ్ విధించిందన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు