శ్రీకాకుళంలో 'గులాబ్' గుబులు... జిల్లాలో అధికారులకు సెలవు రద్దు

ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (15:12 IST)
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్‌’ తుఫాను తీరంవైపు కదులుతోంది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 140కి.మీ, ఏపీలోని కళింగపట్నానికి 190కి.మీ దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ దిశగా ముందుకెళ్తోంది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. 
 
శ్రీకాకుళం జిల్లా అంతటా మేఘావృతంకావడంతో పాటు పలుచోట్ల తేలికపాటి వర్షం పడుతోంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రికి కళింగపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 75-90 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది. 
 
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులను జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అప్రమత్తం చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధం చేశారు. జిల్లా పరిధిలోనే తుఫాను తీరం దాటే పరిస్థితి ఉండటంతో గార, కవిటి తీర ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. 
 
ఇద్దివానిపాలెం, పెద్దకర్రివానిపాలెం గ్రామాలను పరిశీలించారు. జిల్లా పరిధిలోనే తుఫాను తీరం దాటే అవకాశమున్నందున మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. తుఫాను పరిస్థితి బట్టి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాల్సి ఉంటుందని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. 
 
అదేసమయంలో తుఫాను పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ, పోలీసు, మెరైన్‌ పోలీసు, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులకు ఈరోజు సెలవు రద్దు చేశారు. జిల్లాలోని అన్ని మండలాలతో పాటు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు