తన రెండో భర్త సంతానం కోసం కన్నకుమార్తెలను అప్పగించిన వివాహిత, ఎక్కడ?
శుక్రవారం, 14 జులై 2023 (15:48 IST)
కొందరు మహిళలు నీతాచి నీచానికి దిగజారిపోతున్నారు. ఏమాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. కామసుఖం కోసం అతి కిరాతంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన రెండో భర్తకు సంతానం పుట్టాలని తన కుమార్తెలనే అతడి వద్దకు బలవంతంగా పంపించి.. పిల్లలు పుట్టేలా చేసిందో కసాయి తల్లి. ఈ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏలూరులోని వట్లూరు పంచాయతీకి చెందిన ఓ వివాహిత(38)కు ఇద్దరు కుమార్తెలు. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. మొదటి భర్త 2007లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత తన మేనత్త కుమారుడైన పుట్టా సతీష్ పవన్ కుమార్ (43)ను రెండో పెళ్లి చేసుకుంది. పిల్లలిద్దరినీ విశాఖపట్నంలోని తన పుట్టింటికి పంపించి, అతనితో కాపురం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు సంతానం కలగదని భావించిన సతీష్ కుమార్ మరో మహిళ ద్వారా సంతానం పొందుతానని చెప్పాడు. దీన్ని జీర్ణించుకోలేని ఆమె.. తన ఇద్దరు కుమార్తెలు ఈడుకొచ్చారని, వారి ద్వారా సంతానం పొందాలని భర్తకు సలహా ఇచ్చింది.
దీనికి అతను కూడా సమ్మతం తెలిపాడు. ఆ వెంటనే పుట్టింటి వద్ద ఉన్న ఇద్దరు కుమార్తెలను తీసుకొచ్చింది. పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతున్న సమయంలో కన్న తల్లి ఆమెను సతీష్ కుమార్ వద్దకు పంపించింది. ఆ చిన్నారి ప్రతిఘటించినా చావబాది లైంగికదాడికి చేశారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో చదువు ఆగి, అందరికీ తెలిసిపోతుందని భయపడి అబార్షన్ చేయించారు. చివరకు పదో తరగతిలోకి రావడంతో మరోసారి ఆ విద్యార్థినిని గర్భవతిని చేశారు. 2021 జూన్ 3న పాప జన్మించింది.
అయితే తనకు మగ బిడ్డ కావాలని సతీష్ చెప్పడంతో ఈసారి తన రెండో కుమార్తె (16)ను పంపింది. ఆమె కూడా గర్భం దాల్చడంతో ఇంటిలోనే డెలివరీ చేశారు. కానీ, ప్రాణం లేని మగశిశువు పుట్టడంతో ఆ బిడ్డను కాలువలో పడవేశారు. ఇటీవల సతీష్‌కు, ఆమెకు గొడవలు రావడంతో ఆమె తన ఇద్దరు పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లి పోలీస్ స్టేషనులో వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఆ తర్వాత సతీష్ అతని వద్ద ఉన్న తన భార్య కూతుళ్లిద్దరినీ తీసుకుని వచ్చాడు.
అక్కడ ఆమె లేకపోవడంతో కుమార్తెలిద్దరినీ శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఈ విషయం బాలికల మేనమాకు తెలిసి.. బుధవారం ఏలూరు చేరుకుని దిశ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో దిశ పోలీసులు పుట్టా సతీష్ తోపాటు ఆమెపై పోక్సో కేసు, అత్యాచారం కేసులను నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఈ ఘోరం వెలుగుచూసింది. ప్రస్తుతం పెద్ద కుమార్తె మూడో నెల గర్భిణి అని పోలీసులు గుర్తించారు.