బద్వేలు ఉప ఎన్నికపై సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ సమావేశం

గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:28 IST)
ఏపీలో బ‌ద్వేలు ఉప ఎన్నిక‌పై వైసీపీ అపుడే క‌స‌ర‌త్తులు ప్రారంభించింది. ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకుల‌తో ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. దివంగత వెంకట సుబ్బయ్య భార్య సుధ కూడా డాక్టరే అని, ఆమెను పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ ఇక్కడకు వచ్చిన వారి అందరి మీదా ఉన్నాయ‌ని, నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. 
 
బ‌ద్వేలులో 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చింద‌ని, గతంలో వెంకసుబ్బయ్యకి వచ్చిన మెజార్టీ కన్నాఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధకి రావాల‌ని కోరారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడద‌ని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాల‌న్నారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగింద‌ని, ఈసారి ఓటింగ్‌ శాతం పెరగాలి, ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాల‌ని, ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాల‌ని సూచించారు. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాల‌ని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాల‌ని, ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి వారిని అభ్యర్థించాల‌న్నారు. 
 
వారు పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా వారిని చైతన్యం చేయాల‌ని, నెల రోజుల పాటు మీ సమయాన్ని కేటాయించి, ఎన్నికపై దృష్టిపెట్టాల‌ని నాయ‌కుల‌కు సీఎం చెప్పారు. బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటార‌ని, వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాల‌ని సూచించారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయండి అని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం స‌ల‌హాలు ఇచ్చారు. 
ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్‌ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు,  పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు