సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక వ్యక్తి అరెస్ట్

గురువారం, 30 సెప్టెంబరు 2021 (13:28 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పోలీసులు ఇవాళ ముంబైలోని ఖార్ ఏరియాలో కునాల్ జాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు కునాల్ స్నేహితుడు. 
 
అయితే సుశాంత్ మరణం తర్వాత అతను పరారీలో ఉన్నాడు. గత ఏడాది జూన్ 15వ తేదీన సుశాంత్ అనుమానాస్పద రీతిలో బాంద్రాలోని తన ఫ్లాట్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణాన్ని నార్కోటిక్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో లింకు ఉన్న అనేక మందిని అరెస్టు చేశారు.
 
సుశాంత్ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్ కోణం మరో సంచలనానికి తెరతీసింది. అందులో స్టార్స్ పేర్లు బయటకు వచ్చాయి. బాలీవుడ్ ధగధగలు వెనుక దాగున్న చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది సుశాంత్ మరణం. అప్పటికే సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రేయసి రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులోనే జైలుకు వెళ్ళింది. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ సుశాంత్ అభిమానుల ట్రోలింగ్‌కు బలైంది.
 
ఇక ఇటీవలే సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిని డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఏడాది గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆయన అభిమానులను బాధ పెడుతోంది.
 
టాలెంటెడ్ హీరో సుశాంత్ తాను నటించిన కై పో చే, ఎంఎస్ ధోని, సోంచిరియా, చిచ్చోరె వంటి అద్భుతమైన చిత్రాల ద్వారా అభిమానుల హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతాడు. సుశాంత్ ఆఖరిగా నటించిన చిత్రం “దిల్ బెచారా”. జూలై 2020లో సుశాంత్ మరణానంతరం ఈ చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలై వీక్షణల పరంగా చరిత్రను సృష్టించింది. 
 
ప్రస్తుతం సుశాంత్ కేసు త్వరగా తేలాలని అభిమానులు కోరుకుంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు