ఏపీ సీఎం జ‌గ‌న్ దార్శినికత బాగుందన్న ఫ్లిప్ కార్ట్‌ సీఈఓ

గురువారం, 16 డిశెంబరు 2021 (18:00 IST)
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ జ‌రిపారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని వారికి ఏపీ సీఎం జ‌గ‌న్ పిలుపునిచ్చారు. విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. 
 
 
రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గర నుంచి వారి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని సీఎం ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓకు వివరించారు. రైతులకు పంటలకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిప్‌ కార్ట్‌ దోహదపడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడాలన్నారు. 
 
 
ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు సీఎం యాప్‌ ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని కూడా సీఎం కోరారు. తాము విస్తృతపరుస్తున్న సరుకుల వ్యాపారంలో రైతులనుంచి ఉత్పతులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమన్నారు. మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. 
 
 
రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ, ఇ–కామర్స్‌ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు మందుకు రావాలని సీఎం ఫ్లిప్‌కార్ట్‌కు పిలుపునిచ్చారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి ప్ర‌తిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ సానుకూలత వ్యక్తం చేశారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామన్నారు. వచ్చే ఏడాది నుంచే  ఈ కార్యక్రమాలు మొదలవుతాయన్నారు.
 
 
 మత్స్య ఉత్పత్తులు రాష్ట్రంనుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సహాయపడాలని సీఎం విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే తమ భాగస్వామ్య సంస్థ వాల్‌మార్ట్‌ ద్వారా రాష్ట్రంలో మత్సు్యఉత్పత్తుల కొనుగోలు, ఎగుమతి జరుగుతోందని, దీన్ని మరింతగా పెంచుతామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ తెలిపారు. సీఎం దార్శినికత బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు ఆయన అంకితభావంతో ఉన్నారన్నారు. తన ఆలోచనలన్నీ పంచుకున్నారన్నారు. 
 
 
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను కలిసిన వారిలో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తితోపాటు, సీసీఏఓ రజనీష్‌కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి సోలోమన్‌ ఆరోకియా రాజ్‌ పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు