బంగాళాఖాతంలో అల్పపీడనం - తిరుమల కొండపై కుంభవృష్టి

ఠాగూర్

సోమవారం, 14 అక్టోబరు 2024 (15:56 IST)
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైం తిరుమలలో తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమైన వర్షం భారీ వర్షంగా మారి కుంభవృష్టి కుర్సుతంది. దీంతో తిరుమాడ వీధుల్లో వర్షపు నీరు ప్రవహిస్తుంది. తిరుమలలో భారీ వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు. భక్తులు వర్షంలో ఉండొద్దని, షెడ్లు ఖాళీ అయిన వెంటనే లోపలికి పంపిస్తామని తెలిపారు. 
 
బంగాళాఖాతంలో అల్పపీడనం... 48 ఏపీకి భారీ వర్ష సూచన 
 
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడిందని, ఈ కారణంగా రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం ఏర్పడిన 48 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తా వైపు కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 
 
ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆ తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ల రాదని హెచ్చరికలు జారీ చేశారు.
 
ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. 
 
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
 
మరోవైపు, భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్​కు దూరంగా ఉండాలని సూచించారు. బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదని, పాత బిల్డింగ్స్ వదిలి సురక్షిత భవనాల్లో ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు.
 
అదేవిధంగా మంగళవారం ప్రకాశం, శ్రీసత్యసాయి, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కాలువలు, కల్వర్టులు, మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు