బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
సోమవారం, 8 నవంబరు 2021 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది.
అలాగే, బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీ మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడనున్నది. దీంతో ఈనెల 12 వరకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం వాతావరణ శాఖ ప్రకటించింది.
ముఖ్యంగా, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని, అనంతపురం, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించింది. అలాగే, పలు జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.