ఏపీలో దేవాదాయ శాఖ పనితీరుపై భువనేశ్వరిపీఠం కమాలానంద భారతి స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు వివరాలను కమలానంద భారతి స్వామి, పుష్పగిరి పీఠం స్వామి విద్యాశంకర భారతి స్వామి మీడియాకు వివరించారు.
గత టీడీపీ ప్రభుత్వంలో పుష్కరాలు సమయంలో ఆలయాలు ధ్వంసం చేశారని గుర్తుచేశారు. గత కొన్ని నెలలుగా ఏపీలో వందలాది ఆలయాలను ధ్వంసం చేశారని.. రామతీర్థంలో రాముడు తల ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధన విరుద్ధంగా హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం జోరుగా జరుగుతోందని స్వామీజీ తెలిపారు. మైనారిటీ మెప్పు కోసం హిందూ దేవాలయాల ఆదాయన్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు.
ఆలయాల ఆదాయాన్ని సెక్యులర్ సంక్షేమ పధకాలకు ఒక్క పైసా ఖర్చు చేయకూడదని... ఆలయాల నిధులను ఇతర హిందూ ఆలయాల కోసం ఖర్చు చేయాలన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి, నిపుణులు ద్వారా ఏపీలో జరుగుతున్న దాడులు...నగలు, ఆస్తులను కాపాడేందుకు కమీటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పురావస్తు శాఖ పరిధిలోని ఆలయాలను పరిరక్షణకు వారితో ప్రభుత్వం చర్చించి ఆలయాల సంరక్షణకు అవకాశం ఇవ్వాలన్నారు. ఆలయాల విషయంలో పురావస్తు నిబంధనల్లో సడలింపులకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. త్వరలో సనాతన ధర్మ పరిరక్షణ మహాసభను నిర్వహించబోతున్నామని...వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాలు అమలు చేయాలని కోరుతున్నామని విద్యాశంకర భారతి తెలిపారు.