సీఎం జగన్ ముందు మోకాళ్ళపై కూర్చొన్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్

గురువారం, 27 జనవరి 2022 (15:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైకాపా కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారంటూ విపక్ష పార్టీలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇపుడు ఓ ఐఏఎస్ అధికారి అదేవిధంగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి జగన్ ముందు మోకాళ్ళపై కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం 73వ గణతంత్ర వేడుకలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం జగన్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ పిలుపు వినగానే సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగమేఘాలపై ఆయన ముందు వాలిపోయి మోకాళ్లపై కూర్చొని సీఎంతో మాట్లాడారు. ఈ సంఘటనపై భిన్న రకాలైన స్పందనలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ కలెక్టర్ వెంకట్రామయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లపై పడ్డారు. ఇది వివాదాస్పదమైంది. ఇపుడు ఏపీలో జరిగిన ఘటనపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రాట్లుగా వ్యవహరించడం లేదని వైకాపా కార్యకర్తల్లా నడుచుకుంటున్నారని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు