ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో విమర్శలు గుప్పించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీలు అమలు చేయని వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. రాబోయే కురక్షేత్ర సంగ్రామానికి నంద్యాల, కాకినాడలే నాంది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? పొదుపు మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు.
జాబుల విషయంలోనూ ఇంతే జరిగిందన్నారు. గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని తెలిపారు. పేద పిల్లల ఉన్నత చదువు కోసం మహానేత వైఎస్‌ఆర్ ఫీజు రియంబర్స్‌ను అమలు చేస్తే, ఈ ప్రభుత్వం దానిని నీరుగార్చేసింది. ఆరోగ్యశ్రీ, 108లను నిర్విర్యం చేసేశారు. అందుకే హామీలు అమలు చేయని వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని ప్రజలను కోరిన వైఎస్ జగన్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.