ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే అయినప్పటికీ, ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా ఆ నిరసన ఉండరాదని భావిస్తున్నానని పవన్ చెప్పారు. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రధాన మంత్రి గౌరవానికి భంగకరంగా ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఎటువంటి వ్యక్తులైనా ప్రవర్తించరాదని అన్నారు. ప్రధాన మంత్రిని గౌరవించడం అంటే మన జాతిని, మన దేశాన్ని గౌరవించడమే. ఈ దుస్సంఘటన కావాలని చేసినట్లు నేను భావించడం లేదు.
అయితే ప్రధాన మంత్రి ఇతర రాష్ట్రాలలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ ను తు.చ. తప్పకుండా పాటించవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుంది. ఇది సర్వవిదితమే. మరోసారి ప్రధాన మంత్రికిగానీ, అత్యంత బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించిన నరేంద్ర మోదీకి గౌరవపూర్వక అభినందనలు తెలియచేస్తున్నా అని పవన్ తెలిపారు.