అమ్మాయిలతో జల్సాలకు అలవాటుపడి భారీ మొత్తంలో అప్పులు చేశాడు. ఈ బాకీలు తీర్చలేక భార్యాబిడ్డలను అమ్మకానికి పెట్టాడో ఆటోడ్రైవర్. ఈ ఘటన కర్నూలు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కోవెలకుంట్ల పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ పసుపులేటి రామయ్య, వెంకటేశ్వరమ్మ(వెంకటమ్మ) దంపతులు. వీరికి మధు, మహేశ్వరి, మౌనిక, మనీషా అనే నలుగురు కూతుళ్లు, సారయ్య అనే కుమారుడు ఉన్నాడు.
అయితే, మద్దిలేటి మద్యం, జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. పైగా మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. అదేసమయంలో భారీగా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చలేక పోయాడు. పైగా, అప్పులిచ్చినవారు ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచక భార్యకు తెలియకుండా కుమార్తెలను విక్రయించసాగాడు.
యేడాది క్రితం రూ.1.50 లక్షలకు రెండో బిడ్డను, మరో రూ.2 లక్షలకు పెద్ద కూతురిని దగ్గరి బంధువులకే అమ్మేసి ఒప్పందం చేసుకున్నాడు. అప్పట్లో పురిటికోసం వెళ్లిన భార్యకు ఈ విషయం తెలియలేదు. ఈ పిల్లలనే కాదు.. భార్యను కూడా రూ.5 లక్షలకు కుదువ పెట్టి అగ్రిమెంట్‌పై సంతకం పెట్టమని, పిల్లలను అప్పగించాలంటూ రామయ్య వేధించడంతో ఐదుగురు పిల్లలతో వెంకటేశ్వరమ్మ ఏడాది క్రితమే పుట్టినిల్లయిన నంద్యాల పట్టణంకు చేరుకుంది.
అక్కడి తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తోంది. ఇంతలో డబ్బు ఇచ్చి పిల్లలను కొనుగోలు చేసిన వ్యక్తులు.. అప్పు కడతావా, పిల్లలను అప్పగిస్తావా అని ఒత్తిడి తేవడంతో నాలుగు రోజుల క్రితం రామయ్య నంద్యాలకు వచ్చి బిడ్డలను ఇవ్వాల్సిందిగా భార్యతో గొడవకు దిగాడు. చేసేది లేక వెంకటమ్మ ఐసీడీఎస్ అధికారులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది.