కలికాలం కంటే భయంకరమైనది.. కరోనా కాలం. కన్నతల్లి మరణించినా.. కడచూపునకు కూడా స్పందించని ఘోరమైన రోజులివి. అందరు ఉన్నా అనాథగా మారింది ఆ వృద్ధురాలు. జీవిత చరమాంకంలో పట్టెడన్నం పెట్టి సపర్యలు చేసేవారు లేక నరకయాతన పడుతోంది అవసాన దశలో నా అన్న వారు ఎవరూ లేక ఒంటరిగా రోడ్డు పక్కన, చెట్టు నీడన చిన్న గుడిసెలో అత్యంత దయనీయంగా బతుకీడుస్తుందామె.
పెడన మండలం నడపూరు గ్రామానికి చెందిన పుట్టి వజ్రం అనే వృద్ధురాలు అష్టకష్టాలు పడుతూ మచిలీపట్నం చేరుకొంది. సోమవారం నుంచి వారం రోజులపాటు లాక్ డౌన్ అమలుకావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారేయి. అటువంటి పరిస్థితులలో ఆ పండుటాకు చేతి కర్ర సైతం లేని పరిస్థితులలో ఎండిపోయిన చెట్టుకొమ్మ పుల్లను ఆసరా చేసుకొని వణుక్కొంటూ మంత్రి పేర్ని నాని కార్యాలయంకు చేరుకొంది.
"మామ్మగారు... మీరు వృద్ధాశ్రమంలో చేరతారా ? నేనే స్వయంగా చేర్పించి అక్కడ మిమ్మలిని జాగ్రత్తగా చూడమని చెబుతాను" అని మంత్రి పేర్ని నాని ఆమెను అడిగారు. దీంతో ఆ వృదురాలు సంతోషంగా అంగీకరించడంతో మంత్రి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పండుటాకును తన కారులో ముందు సీటులో కూర్చోపెట్టుకొని స్థానిక ఈడేపల్లిలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వృద్ధాశ్రమంలో చేర్పించారు.
అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో పట్టించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. సాకలేని స్థితిలో వారిని వృద్ధాశ్రమంలోనైనా చేర్పించాలి కానీ, ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేయడం విచారకరమన్నారు.