అనేక రాష్ట్రాల నుంచి యాత్రికులు వచ్చే నెల్లూరు జిల్లాలోని ఏ.ఎస్ పేట దర్గా మౌలిక వసతులను మరింత పెంచి దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి మేకపాటి హామీ ఇచ్చారు. దర్గాకు ఎక్కడెక్కడ నుంచో వచ్చే యాత్రికులకు అనువుగా గాంధీ సెంటర్ లో బస్ షెల్టర్ నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించిన వెంటనే రూ.10 లక్షలతో బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి మేకపాటి.
కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలసకార్మికులకు ఏ.ఎస్ పేట దర్గ, వక్ఫ్ బోర్డు అందించిన వసతి, భోజన సహకారాలను మంత్రి మేకపాటి ఈ సందర్భంగా అభినందించారు. ప్రవక్త మహమ్మద్ ఓ సంఘ సంస్కర్తగా, ఆదర్శ భర్తగా, కుటుంబ యజమానిగా, అంకితభావం గల నాయకునిగా జీవనం సాగించడం వల్లే నేటికీ మహనీయులుగా ఆరాధింపపడుతున్నారని, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి మేకపాటి కోరారు.