ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు.. నాగబాబు హర్షం

గురువారం, 3 మార్చి 2022 (17:39 IST)
ఏపీ రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అమరావతిలో రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిందని నాగబాబు అన్నారు.
 
ఇది అమరావతి రైతులు, మహిళలతో పాటు ఆంధ్ర ప్రజల విజయమని నాగబాబు పేర్కొన్నారు. 800 రోజులకు పైగా ఎన్నో అవరోధాలు దాటుకొని మొక్కవోని దీక్ష చేసిన అమరావతి రైతుల దీక్ష ఫలించిందని నాగబాబు అన్నారు. 
 
గతంలో అధికార టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రతిపాదించగా, వైసీపీ కూడా ఒప్పుకుంది. అమరావతే రాజధాని అవుతుందని నమ్మి రైతులు తమ భూములు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని.. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు.  
 
అమరావతి ఉద్యమానికి మా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ ప్రజల జోలికి వెళ్లొద్దు.. అంటూ హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు