రాజధాని అమరావతే.. క్యాపిటల్ మార్చే అధికారం అసెంబ్లీకి లేదు: హైకోర్టు తీర్పు

గురువారం, 3 మార్చి 2022 (12:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. శాసనసభకు లేని అధికారంతో సీఆర్డీఏ చట్టాన్ని రద్దు కుదరదని పేర్కొంది. పైగా, ఏపీ రాజధానిగా అమరావతిని ఆర్నెలల్లో అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, అమరావతి నుంచి ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించడానికి వీల్లేదని, ఈ తరలింపుపై ఇప్పటికే ఉన్న మధ్యంతర ఉత్తర్వులు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.
 
రాజధాని వ్యవహారంపై దాఖలైన మొత్తం 75 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వేర్వేరుగా గురువారం సంచలన తీర్పును వెలువరించింది. అంతేకాకుండా, రాజధాని పిటిషన్లపై విచారణ జరుపరాదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 
 
రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తరలించకూడదని స్పష్టం చేసింది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు మూడు నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచి ప్లాట్లను అప్పగించాలని సర్కారు తేల్చి చెప్పింది. 
 
రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను రాజధాని నిర్మాణం కోసం మినహా ఇతర అవసరాలకు తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా, అమరావతి రాజధానిపై వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాలని సర్కారును ఆదేశించింది. 
 
కాగా, ఏపీ సీఆర్డీఏ చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు) చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇపుడు హైకోర్టు కీలక తీర్పును వెలువరించడం సర్కారుకు గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కున్న చందంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు