వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు.. మార్చి 4 నుంచి ఆ జిల్లాలకు అలెర్ట్

బుధవారం, 2 మార్చి 2022 (21:23 IST)
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 
 
అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 4 నుంచి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి.
 
సముద్ర తీరం వెంబడి 45- 55 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప.. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు. 
 
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రం లోపలకు వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించారు. గతేడాది నవంబర్‌లో జరిగిన వరద బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు