తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ అక్కర్లేదు: టిటిడి

శనివారం, 19 సెప్టెంబరు 2020 (08:19 IST)
తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మీద న‌మ్మ‌కం, భ‌క్తి ఉన్న అనేక‌మంది ఇత‌ర మ‌తాలకు చెందిన వారు ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారని, అందువల్ల అన్యమతస్తుల డిక్లరేషన్ అక్కర్లేదని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు.

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు శ‌నివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంట‌ల మ‌ధ్య‌ మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య అంకురార్ప‌ణ జ‌రిగిందని చెప్పారు.

ఈ నెల 23వ తేదీ గ‌రుడ‌సేవ రోజున సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలిపారు.

బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగుతున్నందువ‌ల్ల గ‌రుడ‌సేవ రోజు స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించాల‌ని తాము కోరినందువ‌ల్లే సిఎం ఆరోజు వ‌స్తున్నార‌ని చెప్పారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో క‌లిసి ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. 
 
ప్ర‌ధానాంశాలు ఇవి.
–  బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తాం. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుంది.
 
– 24వ తేదీ ఉద‌యం ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి  య‌డ్యూర‌ప్ప‌తో క‌లిసి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుంటారు. అనంత‌రం ఉద‌యం 7 గంట‌ల‌కు నాద‌నీరాజ‌న వేదిక మీద జ‌రిగే సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారు. ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ర్ణాట‌క స‌త్రాల నిర్మాణానికి ముఖ్య‌మంత్రులిద్ద‌రు భూమిపూజ చేస్తారు.
 
– ఈసారి స్వ‌ర్ణ‌ర‌థం, ర‌థ‌రంగ డోలోత్స‌వం బ‌దులు స‌ర్వ‌భూపాల వాహ‌నసేవ జ‌రుగుతుంది.
 
– ఈ నెల 27వ తేదీన చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.
 
– తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భ‌‌క్తులు భ‌క్తితో ఆస‌క్తిగా ఎదురు చూస్తారు.
 
– ఈ ఏడాది కోవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయాల‌నే ఉద్దేశంతో పాల‌క‌మండ‌లి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి.
 
– స్వామివారికి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు. భ‌క్తుల కోసం వాహ‌న‌సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. 
 
– గ‌త‌ ప్ర‌భుత్వ హ‌యాంలో టిటిడిలో జ‌రిగిన నిధుల దుర్వినియోగం, అవ‌క‌త‌వ‌క‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేని సంస్థ‌తో ఆడిటింగ్ చేయించాల‌ని ఎంపి సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హైకోర్టులో పిల్ వేశార‌ని ఛైర్మ‌న్ చెప్పారు.
 
– ఈ విష‌యం గురించి తాను ముఖ్య‌మంత్రితో చ‌ర్చించిన‌పుడు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే కాకుండా ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా జ‌రిగిన నిధుల ఖ‌ర్చుపై కాగ్‌తో ఆడిటింగ్ చేయించాల‌ని సిఎం ఆదేశించారు.
 
– పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని సిఎం తీసుకున్న ఈ నిర్ణ‌యం మేర‌కు టిటిడి నిధుల వ్య‌యంపై కాగ్ ఆడిటింగ్ జ‌రిపించాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో తీర్మానం చేశాం.
 
– గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుమ‌ల‌లో జ‌రిగిన ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను, అవినీతిని తాము పూర్తిగా నిర్మూలించాం.
 
– తిరుమ‌ల‌లో ఎలాంటి అన్య‌మ‌త ప్ర‌చారం జ‌ర‌గ‌లేదు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో నెల్లూరు ఆర్‌టిసి డిపోలో ముద్రించిన అన్య‌మ‌త ప్ర‌చార టికెట్ల‌ను కుట్ర‌పూరితంగా తిరుమ‌ల‌కు పంపిన విష‌యం విచార‌ణ‌లో తేలింది. దీని మీద పోలీసు కేసు కూడా న‌మోదైంది.
 
– మ‌ఠాలు లోక‌క‌ల్యాణం కోసం నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు నిధులు ఇచ్చే సంప్ర‌దాయం గ‌తంలో కూడా ఉంది. ఇత‌ర మ‌ఠాల‌కు ఇచ్చిన విధంగానే శార‌దా పీఠం కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆర్థిక‌సాయం చేశాం. ఈ మ‌ఠానికి మాత్ర‌మే ప్ర‌త్యేకంగా నిధులివ్వ‌లేదు.
 
– తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మీద న‌మ్మ‌కం, భ‌క్తి ఉన్న అనేక‌మంది ఇత‌ర మ‌తాలకు చెందిన వారు ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారు.
 
–  కోవిడ్‌-19 నేప‌థ్యంలో టిటిడి ఆదాయం త‌గ్గినా స్వామివారి కైంక‌ర్యాలు, ఆగ‌మ కార్య‌క్ర‌మాలు ఎలాంటి లోటు లేకుండా కొన‌సాగుతున్నాయి.
 
– కోవిడ్ ఇబ్బందుల వ‌ల్ల బ్యాంకులు వ‌డ్డీ త‌గ్గించ‌డంతో గ‌తంలో టిటిడి డిపాజిట్ల మీద 9 శాతం దాకా వ‌చ్చే వ‌డ్డీ ప్ర‌స్తుతం 4.5 శాతానికి త‌గ్గింది. డిపాజిట్ల మీద అధిక వ‌డ్డీ ల‌భించేలా చేయాల‌నే ఉద్దేశంతోనే నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఆర్‌బిఐ గ్యారంటీ ఉంటే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సెక్యూరిటీ బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆలోచించాం.
 
టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ :
– అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి భూమిపూజ జ‌రుగుతున్న స‌మ‌యంలో శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం లైవ్ ఉన్నందువ‌ల్ల ఎస్వీబీసీ ఆ కార్య‌క్ర‌మాన్ని లైవ్ ఇవ్వ‌లేక‌పోయింది.
 
– ఆ త‌ర్వాత వార్త‌ల్లోను, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలోను ఈ అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌సారం చేసింది.
 
– శ్రీ‌వారి ఆల‌యంలో హుండీ నిండిన త‌రువాతే కొత్త వ‌స్త్రం మార్చ‌డం జ‌రుగుతుంది.
 
– ఈ ఏడాది డిసెంబ‌రుకు రూ.5 వేల కోట్ల డిపాజిట్లు కాల‌ప‌రిమితి ముగుస్తుంది. ఆ త‌రువాత అధిక వ‌డ్డీ వ‌చ్చేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌యంపై ఒక నిర్ణ‌యానికి వ‌స్తాం.
 
– పెర‌టాసి మాసం ర‌ద్దీ వ‌ల్ల తిరుప‌తిలో స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు జారీ చేసే కౌంట‌ర్ల వ‌ద్ద కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌రుగుతున్నందువ‌ల్లే ఆ టికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాం. ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చాక వీటిని పున‌రుద్ధ‌రిస్తాం.
 
శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు :
–  కోవిడ్ నేప‌థ్యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాం.
 
– చ‌క్ర‌స్నానానికి సంబంధించి ఆల‌యంలోనే ఏర్పాట్లు చేశాం. అయినా, అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటాం.
 
– అష్ట‌దిక్పాల‌కుల‌కు జ‌రిగే ఉప‌చారాలు, బ‌లి, నైవేద్యాల స‌మ‌ర్ప‌ణ ఆల‌య ప్రాకారంలోనే నిర్వ‌హిస్తాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు