సమయం ఆసన్నమైంది.. వైకాపా ఉగ్రవాద పాలసీని ఎదుర్కొందాం... పవన్ పిలుపు
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (12:12 IST)
ఏపీలోని వైకాపా ప్రభుత్వంపై అమీతుమీ తేల్చుకునేందుకు జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. వరుసగా సినిమాల షూటింగుల్లో బిజీగా గడుపుతూ వచ్చిన ఆయన.. ఇకపై మళ్లీ పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతానని ఇప్పటికే ప్రకటించిన ఆయన.. సాయితేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఏపీ సర్కారుపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అనంతరం కూడా ట్విట్టర్ వేదికగా ఏపీ సర్కారుపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ మంత్రులు తనపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా మరో ట్వీట్ చేశారు.
'వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం'కి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది' అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను ఇక రాజకీయాలపైనే దృష్టి పెడతానన్న సంకేతాలు ఈ ట్వీట్ ద్వారా ఇచ్చారు.
ఒకవైపు, ఏపీ మంత్రులు తనపై మాటల దండయాత్ర చేస్తుంటే పవన్ మాత్రం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తూ తనపని తాను చేసుకుని పోతున్నారు. అదేసమయంలో ఆయన మంగళవారం పంజాబ్ పర్యటనకు బయలుదేరివెళ్లారు.