సుజాత ఆత్మహత్య.. ప్లాస్టిక్ కుర్చీలతో పిల్లలు ఆడుకున్న పాపం.. ఓనర్ అరెస్ట్..

మంగళవారం, 8 నవంబరు 2016 (16:47 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి వద్ద ఒక వివాహిత చిన్న కారణానికే ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. కూకట్ పల్లిలో ఇంటి ఓనర్ వేధింపుల కారణంగా సుజాత ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. సుజాత అద్దెకు ఉన్న ఇంటి యజమాని ప్రస‍న్న కుమార్ రెడ్డి, స్నేహలత దంపతులపై కూకట్ పల్లి పోలీసులు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. మంగళవారం వారిని మియాపూర్ కోర్టులో హాజరు పరిచారు. 
 
ఇంటి ఓనర్ పిల్లలు అల్లరి చేస్తున్నారని గొడవకు దిగాడని.. ఆపై తనపై చేజేసుకున్నాడని.. దీంతో మనస్తాపానికి గురైన సుజాత ఇంటి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలియగానే ఇంటి ఓనర్ ప్రసన్న కుమార్ రెడ్డి పరారయ్యాడు. ఈ ఇంటిలో రెండున్నరేళ్లుగా సుజాత దంపతులు అద్దెకు ఉంటున్నారు. సుజాత పిల్లలు అల్లరి చేస్తున్నారని కొంతకాలంగా ఓనర్ గొడవ పడినట్టు తెలుస్తోంది.
 
సుజాత భర్త ఇంట్లో లేని సమయంలో ఓనర్ ఆమెతో గొడవపడి, అసభ్యంగా మాట్లాడాడని బంధువులు చెప్పారు. సుజాత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కాగా.. ‘నా చావుకు ఇంటి యజమానులే కారణం’ అని గోడపై రాసి సుజాత అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
పోలీసులు, మృతిరాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... తూర్పు గోదావరి పాలకొల్లుకు చెందిన జి. సుజాత, జి. రామకృష్ణ దంపతులు. వీరు తమ ఇద్దరు కొడుకులు రిషి(4), అమిత్యసాయి(ఒకటిన్నర సంవత్సరం)లతో కలిసి కూకట్‌పల్లి మెడికల్ సొసైటీలోని ప్రసన్నకుమార్, స్నేహలత ఇంట్లో గత రెండున్నర సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్నారు. 
 
గత నాలుగు రోజుల క్రితం రామకృష్ణ ఉద్యోగరిత్యా ఊరికి వెళ్లగా సుజాత పిల్లలతో కలిసి ఉన్నది. సోమవారం ఉదయం వచ్చిన రామకృష్ణ తలుపు తట్టగా స్పందన రాలేదు. దీంతో రామకృష్ణ తన సోదరుడు నరేష్  సహాయంతో ఇంటి వంట గది వైపు ఉన్న తలుపును బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. 
 
బెడ్ రూం తలుపు తట్టడంతో లోపలి నుంచి కొడుకు రిషి తలుపు తీశాడు. లోనికి వెళ్లి చూడగా సుజాత ఫ్యానుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఇంటి గోడలపై నా చావుకి ఇంటి యజమానులు ప్రసన్న, స్నేహలతలు కారణం అంటూ రాసి ఉంది. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు వివరాలు సేకరించారు.  
 
ఆదివారం సాయంత్రం సుజాత పిల్లలు ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలతో ఆడుకుంటున్నారు. అయితే యజమానులు ప్రసన్నకుమార్, స్నేహలతలు శబ్దం చేయవద్దని సుజాతను మందలించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రసన్నకుమార్ కోపంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోండి, తరచూ ఏదో గొడవ చేస్తున్నారని గట్టిగా మందలించాడు. ఈ క్రమంలో గొడవ పెద్దదై సుజాతపై ఓనర్ చేజేసుకున్నాడని అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి