టీడీపిని వదిలేయండి... బీజేపీని బతికించండి... భాజపా సీఎం కావాలి... అమిత్ షా సభలో ప్లకార్డులు

గురువారం, 25 మే 2017 (21:18 IST)
విజయవాడలో భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాట్లాడారు. ఆయన మాటల్లోనే... "కార్యకర్తల కృషి వల్లే 13 రాష్ట్రాల్లో అధికారం వచ్చింది. మోదీ ప్రధాని అయిన తర్వాత 106 పథకాలు అమలు చేశాం. 23 కోట్ల మంది ప్రజలకు జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరిచాం. 
 
విజయవాడ అంటే విజయాలవాడ. ఇక్కడి నుంచే భాజపాను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి. ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ అంటోంది. అధికారంలో వున్నప్పుడు ఏమీ చేయలేదు. విభజన బిల్లులో ప్రత్యేక హోదా కాంగ్రెస్ పెట్టనేలేదు. మేము అధికారంలోకి వచ్చాక స్పెషల్ ప్యాకేజీ ద్వారా ప్రత్యేక హోదాకు తగ్గకుండా నిధులు అందిస్తున్నాం.
 
ఇప్పటివరకూ రూ.1,65 వేల కోట్ల అందించడం జరిగింది. వచ్చే జూలై నెలలో నరేంద్ర మోదీ విశాఖకు వస్తారు. మీరంతా ఆయనకు ఘన స్వాగతం తెలపాలి. ప్రతి బూత్, గ్రామస్థాయిలో భాజపా బలోపేతం అయ్యేవరకూ మిమ్మల్ని నేను వెంబడిస్తూనే వుంటాను. ఆగస్టు నుంచి 3 నెలలు ఇక్కడే వుంటాను'' అని చెప్పారు.
 
కాగా సభలో కొందరు టీడీపిని వదిలేయండి... బీజేపీని బతికించండి... భాజపా సీఎం కావాలి... అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ హంగామా చేశారు. వారిని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వారించారు. అయినప్పటికీ వారు ప్లకార్డులను సమావేశం ముగిసేవరకూ ప్రదర్శిస్తూనే వున్నారు.

వెబ్దునియా పై చదవండి