నా భర్త ఒట్టి తాగుబోతని, పనీపాటాలేని సోమరిపోతు అని గాయని మధుప్రియ ఆరోపించారు. పెళ్లైన మూడు నెలల నుంచి భర్త శ్రీకాంత్ తనకు నరకం చూపిస్తున్నాడని గాయని మధుప్రియ (19) హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
అపుడు ఆమె తన భర్త శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ... పెళ్లైన మూడు నెలలపాటు వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగిందని చెప్పుకొచ్చింది. అయితే, పనీపాటా లేని శ్రీకాంత్ కట్నం తీసుకురావాలని వేధించాడని, పలుసార్లు తీవ్రంగాకొట్టాడని పేర్కొంది. వారం రోజుల క్రితం కూడా తనను తీవ్రంగా కొట్టి గాయపరిచాడనీ తెలుపుతూ.. ఆ గాయాలను కూడా మీడియాకు చూపించింది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి లక్షలాది రూపాయలు కట్నం తీసుకొస్తే.. ఆ డబ్బుతో ఎంజాయి చేద్దామంటూ చిత్రహింసలు పెట్టారని ఆరోపించింది.
అదేసమయంలో తనలాంటి జీవితం ఏ ఆడబిడ్డకూ రాకూడదన్నారు. కానీ, ప్రేమించడం తప్పు కాదు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని యువతకు సూచించింది. తల్లిదండ్రుల మాట వినకుండా శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకున్నానని, దానికి శిక్ష కూడా అనుభవించానని అందువల్ల తల్లిదండ్రులు తనను క్షమించాలని కోరింది. మరోవైపు.. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.