ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహబలాల్లో తేడా వచ్చిందా? ఈ అనుమానం ఏదో మామూలు వ్యక్తికి వచ్చి ఉంటే పర్వాలేదు కానీ క్రైస్తవ మతస్తుడైన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కి రావడమే వింత గొలుపుతోంది. తొలిరోజు అసెంబ్లీలో ఉదయం 11.06 గంటలకు ముహూర్తం గవర్నర్ చేత ప్రసంగాన్ని ప్రారంభింపజేస్తే 11.10 గంటకు సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందని, ఇదేమి గ్రహబలమోనని జగన్ వ్యాఖ్యానించడంలో చాలా అర్థాలే ఉన్నట్లు తెలుస్తోంది.
ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందనే విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలికిపాటుకు లోనయ్యారని, ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్లిం చేందుకే అసెంబ్లీ ముగిసిన అరగంటకే విలేకరుల సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా మాట్లాడారని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయమని, ఈ విషయం చంద్రబాబుకూ తెలుసు, మనకూ తెలుసన్నారు. విలేకరులు ప్రశ్నించినపుడు అదేదో చాలా తేలికైన విషయం అన్నట్లుగా చంద్రబాబు తోసిపుచ్చారన్నారు. తనపై 26 కేసులు పెట్టారని ఏమీ కాలేదని చంద్రబాబును మీడియా అడిగినపుడు చెప్పారని అయితే ఏ కేసు కూడా విచారణ దశ వరకు వెళ్లలేదనే విషయం మాత్రం చెప్పలేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు తన చాకచక్యం, పలుకుబడి వినియోగించి చాలా కష్టపడి స్టేలు తెచ్చు కుంటారని జగన్ అన్నారు.