ఏపీలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. తొలిదశ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో అన్ని స్థానాల్లో నామినేషన్ వెయ్యాలని సూచించారు.
బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని ఆదేశించారు. బైండోవర్ కేసులు, అపహరణలతో అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రలోభపెట్టాలని చూస్తే తిప్పి కొట్టాలని, వాటిపై ఎక్కడిక్కడ ఫిర్యాదు చేయాలని సూచించారు.
వైకాపా గూండాల చేతిల్లోకి వెళ్తే.. గ్రామాలకు కన్నీరే మిగులుతుందన్నారు. వైకాపా నాయకులు గ్రామాలను కక్షలు కార్పణ్యాలకు వేదికలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ గుణపాఠం చెప్పే అవకాశం ఈ ఎన్నికల ద్వారా వచ్చిందని చంద్రబాబు సూచించారు.
ఎవరి బెదిరింపులకూ భయపడాల్సిన పని లేదని, ధైర్యంగా ముందుకొచ్చి నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు. వైకాపా గూండాల బారి నుంచి పార్టీలను మీరే కాపాడు కోవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.