టీడీపీ అంటే తాలిబాన్‌ దేశం పార్టీ: సజ్జల రామకృష్ణారెడ్డి

సోమవారం, 20 సెప్టెంబరు 2021 (06:35 IST)
టీడీపీ అంటే తాలిబాన్‌ దేశం పార్టీ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ...
 
"స్థానిక ఎన్నికల ఫలితాల్లో మూడోసారి కూడా ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. అందుకు ప్రజలందరికీ శిరస్సు వంచి పార్టీ తరపున, సీఎం వైయస్‌ జగన్‌ తరపున వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా రిటైర్డ్‌ ఎన్నికల కమిషనర్, టీడీపీ ఏజెంట్‌గా పని చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో పాటు, మొత్తం ఆ వ్యవహారాన్ని వెనక నుంచి నడిపిన చంద్రబాబుగారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాము. ఎందుకంటే నిజానికి ఈ ఎన్నికలు, ఫలితాలు గత ఏడాది రావాల్సి ఉంది. 
 
బొక్కబోర్లా పడినా..:
ఇవాళ అచ్చెన్నాయుడు అంటున్నారు.. దమ్ముంటే ఎన్నికలు పెట్టండి అని. మరి ఎన్నికలు పెట్టినప్పుడు తప్పుకున్నామన్నారు. ఇప్పుడు దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటున్నారు. 2019లో బొక్కబోర్లా పడినా బుద్ధి తెచ్చుకోకపోగా, నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించకపోగా, అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల కంటే రెండింతలు ఎక్కువగా విపక్షంలో ఉండి చేసి, న్యాయస్థానాలను ఆశ్రయించి ఇబ్బంది పెట్టడం, మీడియాను ఉపయోగించుకుని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని దుష్ప్రచారం చేయడం కొనసాగిస్తున్నారు.
 
జగన్‌ నిరూపించారు:
సీఎం  వైయస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ఒక సస్టెయినబుల్‌ విధానంలో అభివృద్ధి చేస్తూ, బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతుండగా ఎన్నికలు జరిగాయి. అందుకే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లో దాదాపు 90 శాతం ఫలితాలు ఇచ్చారు. ప్రజలు తమకు నచ్చితే అబద్దాలు, అభూత కల్పనలు నమ్మకుండా అక్కున చేర్చుకుంటారనడానికి ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి నిదర్శనంగా నిల్చాయి.
 
ప్రలోభ పెట్టే విధంగా పథకాలు ప్రకటించడం కాకుండా, అన్ని వర్గాలకు నిజమైన సమానత్వం ఇవ్వగలగడం, పేదరికం నుంచి బయట పడేయడం, విద్య, వైద్యం, వ్యవసాయపరంగా కూడా అండగా నిలబడితే, వారి పురోగతికి బాటలు వేస్తే, ఫలితాలు ఎలా ఉంటాయన్నది సీఎం వైయస్‌ జగన్‌ నిరూపించారు.
 
సుదీర్ఘ ప్రక్రియ. ఏమనుకోవాలి?:
ఇందులో ఎవరూ మర్చిపోలేని విషయం.. దేశంలో ఎక్కడా జరగనంత అన్యాయంగా 2020 మార్చిలో మొదలైన ప్రక్రియ 2021 సెప్టెంబరులో ముగిసింది. అది ఎన్నికల కమిషన్‌ ఘనత అనుకోవాలా? వ్యవస్థల మ్యానిప్యులేషన్‌కు గురవుతాయని చెప్పడం అనుకోవాలా. 

నిజం చెప్పాలంటే ఈ ఎన్నికలు 2018లో జరగాలి. కానీ చంద్రబాబు ఎన్నికలు జరపలేదు. అంతకు ముందు 2009 తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా విపక్షనేతగా ఉన్న చంద్రబాబు, జగన్‌ ని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 2018లో ఈ ఎన్నికలు పెట్టాల్సి ఉన్నా, చంద్రబాబు నిర్వహించలేదు. అప్పుడు కూడా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఉన్నారు. నాడు చంద్రబాబునాయుడు అమరావతిని చూపి కూడా ఎన్నికలు పెట్టలేదు.
 
అడ్డుకోవాలని చూశారు:
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నా, బీసీ రిజర్వేషన్ల వల్ల కాస్త ఆలస్యమై 2020లో ఎన్నికలకు సిద్దమయ్యాం. దాంతో వారికి దిక్కుతోచలేదు. జనంలో వస్తున్న స్పందన చూసి, కరోనా సాకు చూపి, ఆరు రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2020 మార్చి 15న ఏకపక్షంగా వాయిదా వేయించారు. ఆ విధంగా ఇంత సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు బాట వేశారు. మీరు ఎన్నిసార్లు వాయిదా వేయించినా మేమే గెలుస్తాం. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రజలు అక్కున చేర్చుకున్నారు.
 
షెడ్యూల్‌లో లేకున్నా..:
కానీ మీరు ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయకుండా, రకరకాల సాకులు, కారణాలు చూపి ఎన్నికలు వాయిదా వేయిస్తూ వచ్చారు. ఏడాది తర్వాత కూడా మధ్యలో ఆగిపోయిన ఎన్నికలు నిర్వహించకుండా, షెడ్యూల్‌లో లేని సర్పంచ్‌ ఎన్నికలు జరిపారు. ఆ తర్వాత కూడా మున్సిపల్‌ ఎన్నికలు జరిగేలా నిమ్మగడ్డను ఉపయోగించారు. దింపుడు కల్లెం మాదిరిగా రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరకు అవి పూరై్తన తర్వాత ఈ ఎన్నికలు కూడా ఆపాలని చూశారు. కానీ జరపాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా కౌంటింగ్‌ జరగకుండా చూశారు. దాదాపు ఆరు నెలలు వాయిదా పడేలా చూశారు.
 
కుంటి సాకులు:
అయినా ఓటమి తప్పదని తెలిసి, ఈ ఎన్నికల్లో తాము పాల్గొనలేదని ఇప్పుడు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో ఎన్నికలు జరిగాయి. మీ అభ్యర్థులకు బీ–ఫామ్స్‌ ఇచ్చారు. పోటీలో అభ్యర్థులను నిలిపారు. కాబట్టి మీరు ఈ ఎన్నికల్లో పోటీలో లేరని చెప్పడం హాస్యాస్పదం. ప్రచారం చేయలేదంటారా. ఆ వీడియోలు కూడా చూపుతాం.
 
కుప్పంలోనూ మీకు పరాభవం:
ఇవన్నీ పక్కన పెట్టండి. కుప్పంలో మీకు నిజంగా బలం ఉంటే, అక్కడ కూడా ఇవాళ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు అక్కడ 50 వేల మెజారిటీ వస్తే, 2019లో 27 వేల మెజారిటీ వచ్చింది. అదే కుప్పం నియోజకవర్గం పరిధిలో సర్పంచ్‌ ఎన్నికల్లో మా పార్టీకి దాదాపు 43 వేల ఓట్లు రాగా, ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 62,957 ఓట్లు వచ్చాయి. కుప్పం మున్పిపాలిటీని కూడా తీసుకుంటే, అది 70 వేలు దాటుతుంది.
 
సీఎం ఘనత:
సీఎం  వైయస్‌ జగన్‌ మాటలు. ఆచరణ.. వ్యవహారశైలి. పాలన. ప్రతి దాంట్లో పూర్తి పారదర్శకత. చెప్పినమాటకు కట్టుబడి ఉండడం. సంక్షేమం కూడా ఒక అభివృద్ధి పథంలో అమలు చేయడం. కోవిడ్‌తో ప్రపంచమే కుదేలై పోయినా నిబ్బరంగా అడుగులు వేశారు. దాదాపు 3 లక్షల కోట్ల అప్పును టీడీపీ వేసి పోయినా, భరిస్తూ కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారు. వారికి ఆర్థిక సహాయం చేశారు. అన్ని రంగాలు తిరిగి సజావుగా జరిగేలా చూశారు. అందుకే 2019లో 50 శాతం ఓట్లతో ప్రజలు ఆదరిస్తే, ఇప్పుడు దాదాపు 90 శాతం ప్రజలు ఆదరిస్తున్నారు. 
 
తాలిబన్‌ దేశం పార్టీ:
మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను చూసిన ప్రజలు గత ఎన్నికల్లో మిమ్మల్ని తిరస్కరించారు. కానీ సీఎం ప్రజలను తన కుటుంబం మాదిరిగా చూసుకుంటున్నారు. అందుకే వారూ ఆదరిస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి.

నిజానికి నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాలి. అంతేకానీ అరాచకం, అన్యాయం, దురాగతాలకు మీరు కేరాఫ్‌గా మారారు. చివరకు టీడీపీ అంటే తాలిబాన్‌ దేశం పార్టీగా మారిపోయింది. చేతకాక తిట్లకు దిగడం. అదే రాజకీయం అనుకోవడం. డ్రామాలు చేయడం. తెలుగుదేశం పారీ విధానంగా మారింది. అయితే ఇవేవీ పని చేయవని రుజువైంది.
 
మా బాధ్యత పెంచింది:
ఈ విజయానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. శాచురేషన్‌ పద్ధతిలో ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తాం. పేదలంతా అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం.  పాజిటివ్‌ ఓటింగ్‌. డిస్టింక్షన్‌ కూడా దాటింది. ఇది బ్రహ్మాండమైన ఫినామినా. దీన్ని అందరూ స్టడీ చేయాలి. అనుసరించాలి. దీంట్లో మూలసూత్రం ఏమిటంటే.. ప్రజలకు ఏం కావాలో చూడాలి. వారి దగ్గరకు వెళ్లాలి. వాళ్లతో అడుగులు వేయాలి. వారి మనసు ఎరగాలి.

వారికి తగిన విధంగా పాలించాలి. పారదర్శకత పాటించాలి. ఈ నాలుగు సూత్రాలు పాటించి, అవినీతికి అతీతంగా, పారదర్శకంగా ప్రజల దగ్గరకు వెళ్లి వారి అవసరాలు తీరిస్తే, వారు తప్పనిసరిగా ఆదరిస్తారు. అదే వైయస్సార్‌సీపీ చేసింది. అందుకే ఈ విజయం సాధించింది" అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ముగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు