ఒకే ఇంట్లో తల్లిబిడ్డ శవాలు : తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడి మృతి

బుధవారం, 20 మార్చి 2019 (13:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లిలో విషాదం జరిగింది. ఒకే ఇంట్లో తల్లీ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. వృద్ధాప్యంతో బాధపడుతూ వచ్చిన తల్లి అనారోగ్యంతో మరణించింది. తల్లి మృతివార్త తెలుసుకుని ఇంటికి వచ్చి.. మృతదేహం వద్ద వెక్కివెక్కి ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. దీంతో ఒకే ఇంట్లో తల్లీకుమారుడు మృతదేహాలను పక్కపక్కనే ఉంచారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు సైతం బోరున విలపిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పోచంపల్లికి చెందిన చెరిపల్లి లలిత (70) అనే వృద్ధురాలు అనారోగ్య కారణంగా ఈనెల 18వ తేదీన కన్నుమూసింది. ఈమె కుమారుడు సుందర్ (50) హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి మరణ వార్తలను సుందర్‌కు చేరింది. 
 
దీంతో తన భార్యాపిల్లలను వెంటబెట్టుకుని పోచంపల్లికి వచ్చాడు. స్వగృహానికి చేరుకున్న సుందర్‌ తల్లి మృతదేహాన్ని చూసి కాళ్లపై పడి బోరున ఏడ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. ఆయన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఒకే ఇంట్లో తల్లీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు భార్య, మరోవైపు పెద్ద కుమారుడు మృతి చెందడంతో వారి మృతదేహాలను చూస్తూ మృతురాలి భర్త చంద్రయ్య విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు