తెలంగాణాలో బయటకొస్తే బుక్కయినట్టే.. పోలీసుల ఉక్కుపాదం

బుధవారం, 25 మార్చి 2020 (09:13 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై ఐపీసీలోని 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నిందితులకు రెండేళ్ళ వరకు జైలుశిక్ష పడే అవకాశాలు లేకపోలేదు. 
 
ముఖ్యంగా, రాజధాని హైదరాబాద్, హైటెక్ సిటీ సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఈ తరహా కఠన చర్యలకు ఉపక్రమించారు. ఒక్క మంగళవారమే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏకంగా 150 మందిపై కేసులు నమోదుచేయడంతోపాటు 244 వాహనాలను సీజ్‌చేశారు. 
 
అలాగే, కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై బారికేడ్లు ఏర్పాటుచేసి పహారా కాస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి కర్ఫ్యూ ఉన్నందున ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చేవారికి నమస్కరించి మరీ లోపలికి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వినకపోతే లాఠీలకు పనిచెప్తున్నారు. వైద్య సిబ్బంది, మీడియాపై కొన్నిచోట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో పోలీసులకు ఉన్నతాధికారులు క్లాస్ పీకారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు