రాజ్యసభలో అడుగుపెట్టనున్న డి శ్రీనివాస్... సోనియాకు నమస్కారం చేస్తారా?

శనివారం, 14 మే 2016 (12:28 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నేత, తెరాస ప్రభుత్వం ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న ఆయన.. తెరాస చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆకర్షితుడై సీఎం కేసీఆర్ చెంతకు చేరారు. అలాంటి డీఎస్‌కు సముచిత స్థానం కల్పించాలని నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత భావించి, చక్రం తిప్పారు. 
 
డీఎస్‌ను రాజ్యసభకు పంపించాలని ఆమె తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సమ్మతం తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు రాజ్యసభ స్థానాల కోసం తెరాస పార్టీకి చెందిన ఐదుగురు సీనియర్ నేతలు పోటాపోటీగా ప్రయత్నం చేసిన క్రమంలో జిల్లాకు చెందిన డీఎస్‌కు  అవకాశం రావడం కోసం ఎంపీ కవిత చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
 
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో అనుభవం ఉన్న నాయకుడు రాజ్యసభలో తెరాస తరపున ప్రాతినిథ్యం వహిస్తే బాగుంటుందన్న ఆమె ఆలోచనను పార్టీ అధిష్టానం బలపరిచింది. ఈ మేరకు ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న డి.శ్రీనివాస్ పేరు రాజ్యసభకు ఖరారు కాగా... నేడో, రేపో అధికారికంగా ప్రకటన వెలువడనుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

వెబ్దునియా పై చదవండి