శ్రీవారి కొండపై బ్రాండెడ్ లగ్జరీ హోటల్స్... లైసెన్సులు జారీ చేయనున్న తితిదే?

ఠాగూర్

మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (10:05 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి నిలయంపై కొత్తగా బ్రాండెడ్ లగ్జరీ హోటల్స్ అందుబాటులోకి రానున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు హోటళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా కొత్త పాలసీ అమలుకు టీటీడీ సిద్ధమవుతోంది. జాతీయస్థాయిలో పేరొందిన బ్రాండెడ్ సంస్థలకు హోటళ్ల లైసెన్సులు జారీచేయాలని భావిస్తోంది. తిరుమలలో ప్రస్తుతం 10 పెద్ద క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. 
 
వీటిని గతంలో టెండర్ల విధానంలో టీటీడీ కేటాయించేది. భారీగా అద్దె చెల్లించేందుకు ముందుకు వచ్చేవారికి లైసెన్సు జారీ చేసేది. అయితే ఆహార పదార్థాల ధరల్లో నిబంధనలు లేకపోవడంతో భక్తుల నుంచి నిత్యం ఫిర్యాదులొచ్చేవి. ఈ క్రమంలో జనతా హోటళ్లకు మాత్రం నిర్ణీత అద్దెను ముందుగానే నిర్ణయించి డిప్ విధానం ద్వారా లైసెన్సులు కేటాయిస్తూ వస్తున్నారు. ఇకపై పెద్ద క్యాంటీన్ల(రెస్టారెంట్లు)కు కూడా ఇదే తరహాలో లైసెన్సులు జారీ చేయాలని తాజాగా నిర్ణయించారు. 
 
రెస్టారెంట్లలో ఆహారపదార్థాల నాణ్యత, ధరల విషయంలో వస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాఫ్ పెట్టనున్నారు. హోటళ్ల నిర్వహణా రంగంలో అనుభవం కలిగిన నిపుణులు, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో టీటీడీ ఇటీవల పలు సమావేశాలు నిర్వహించింది. లైసెన్సుల కేటాయింపులో కొత్త పాలసీని తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. లైసెన్సు కాలపరిమితి మూడేళ్లు కావడంతో సరైన వసతులు కల్పించడం లేదని గుర్తించారు. 
 
కొంతమంది ఒక పేరుపై లైసెన్స్ పొంది మరొకరికి లీజుకు ఇస్తున్నారు. తమ సంస్థ పేరు కాకుండా మరొకపేరు పెట్టుకుని హోటళ్లను నడుపుతున్నారు. కొత్త పాలసీలో ఈ లోపాలను సరిదిద్దనున్నారు. రెస్టారెంట్లను టెండరు ద్వారా కాకుండా నిర్ణీత అద్దెతో డిప్ విధానంలో కేటాయించనున్నారు. లైసెన్సు కాలపరిమితి ఐదేళ్లకు పెంచనున్నారు. బ్రాండెడ్ సంస్థలకు లైసెన్సు కేటాయిస్తే వాటి ప్రతిష్ట దెబ్బతినకుండా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారని టీటీడీ భావిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు