ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కాదు.. పోలీసులు, సీఐడీ అధికారులు సైతం ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునేలా విధులు నిర్వహిస్తారు. వారి చేష్టలకు నవ్వాలో ఏడ్వాలే తెలియక ప్రజలతో పాటు.. రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. విజయవాడ నుంచి కర్నూలుకే కేవలం 10 నిమిషాల్లో వెళ్లగలమా? ఇది ఎవ్వరికైనా సాధ్యంకాదు. కానీ ఏపీ సీఐడీ అధికారులకు మాత్రం సాధ్యమవుతుంది. అందుకే 10.20 గంటలకు నోటీసులు ఇచ్చిన అధికారులు... 10.30 గంటలకు కర్నూలులోని సీఐడీ ఆఫీసులో ఉండాలని హుకుం జారీచేశారు. ఇలా నోటీసులు ఇవ్వడం, అభాసుపాలుకావడం ఏపీ పోలీసులు, సీఐడీ అధికారులకే చెల్లుబాటు అవుతుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం సర్కత్రా చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10.20 గంటలకు నోటీసు ఇచ్చి... 10.30 గంటలకు సీఐడీ ఆఫీసుకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇదే తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఆశ్చర్యం ఏంటంటే 10.30 గంటల కల్లా కర్నూలు సీఐడీ ఆఫీస్‌లో ఉండాలని ఆ నోటీసులో ఉంది. తిరుపతి ప్రచారంలో ఉన్న వ్యక్తికి విజయవాడలో నోటీసు ఇచ్చిన విషయం తెలియడానికే పది నిమిషాలు పడుతుంది. అలాంటిది నెల్లూరులో ఉన్న వ్యక్తి పది నిమిషాల్లో కర్నూలు ఎలా వెళ్లగలడు? కక్ష సాధింపునకు కూడా హద్దులు ఉండాలి కదా! 10 నిమిషాల్లో జిల్లాలు దాటి రావాలంట.. ఇది అంబేడ్కర్ రాజ్యాంగమా.. రాజారెడ్డి రాజ్యాంగమా అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ నోటీసు వ్యవహరం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.