బలాత్కారం చేసేటపుడు ప్రభుత్వ ఉద్యోగి అని గుర్తులేదా? సుప్రీంకోర్టు

మంగళవారం, 2 మార్చి 2021 (12:56 IST)
అత్యాచారం చేసే ముందు అరెస్టు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం ఊడుతుందన్న విషయం గుర్తుకురాలేదా అని ఓ నిదింతుడిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదేసమయంలో అత్యాచారం చేసిన బాలికను వివాహం చేసుకుంటామంటే.. బెయిల్ మజూరు చేసే విషయాన్ని పరిశీలిస్తామని, అలాగని పెళ్లి చేసుకోవాలని తాము ఒత్తిడి చేయడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 
 
మహారాష్ట్ర విద్యుత్తు ఉత్పాదన సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మోహిత్‌ సుభాష్‌ చవాన్‌ (23) అనే వ్యక్తి 2014-15 ప్రాంతంలో తన దగ్గర బంధువైన బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 
 
ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా, బాంబే హైకోర్టు తిరస్కరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా, "మీరు ఆమెను పెళ్లాడుతారా? పెళ్లాడుతామంటే మేం పరిశీలిస్తాం. లేదంటే మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగని పెళ్లి చేసుకోవాలని మేమేమీ ఒత్తిడి తేవడం లేదు" అని వ్యాఖ్యానించింది. 
 
అయితే ఆయనకు ఇప్పటికే వేరే మహిళతో వివాహం జరిగిందని నిందితుని తరపు న్యాయవాది తెలిపారు. తొలుత ఆ బాలికనే పెళ్లాడాలని అనుకున్నారని, కానీ అందుకు ఆమె తిరస్కరించడంతో వేరేవారిని చేసుకున్నారన్నారు. ఆయనను అరెస్టు చేస్తే ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తారని తెలిపారు. 
 
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అత్యాచారం చేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అని తెలియదా అని ప్రశ్నించింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం చేసిన దరఖాస్తును తిరస్కరించింది. అయితే నాలుగు వారాల పాటు అరెస్టు చేయకుండా ఊరటనిచ్చింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం సంబంధిత కోర్టుకు వెళ్లాలని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు