ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ... తనను పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి, సహజీవనం చేసి, ఆపై అత్యాచారం చేశాడని ఓ వ్యక్తిపై కేసు పెట్టింది. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. నిందితుడు, బాధితురాలు రెండేళ్లకు పైగా సహజీవనం చేశారు.
దీనిపై ప్రధాని న్యాయమూర్తి బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "పెళ్లి విషయంలో మోసపూరిత హామీ ఇవ్వడం తప్పు. ఎవరూ అలా చేయకూడదు. కానీ, సహజీవనం చేసి, శృంగారంలో పాల్గొనడాన్ని రేప్ అని ఎలా చెబుతారు?" అని వ్యాఖ్యానించింది. ఈ విషయమై గతంలోనే స్పష్టమైన తీర్పులు ఇచ్చామని గుర్తుచేసింది.
అయితే నిందితుడు శారీరకంగా హింసించాడని, రహస్య భాగాల్లో గాయాలవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని మహిళ తరఫు న్యాయవాది తెలిపారు. ఆమె కాలు కూడా విరగ్గొట్టాడని చెప్పారు. స్పందించిన సీజేఐ.. "అప్పుడు మీరు దాడి, గృహ హింస కేసు పెట్టాలి. అత్యాచార కేసు ఎందుకు పెట్టారు?" అని ప్రశ్నించారు. వివాహ బంధంతో కలిసి జీవిస్తున్న సమయంలో జరిగిన దాడిని అత్యాచారంగా పరిగణిస్తారా? అని ప్రశ్నించారు.