తెలుగు రాష్ట్రాల్లో భర్తలను చంపేస్తున్న భార్యలు...

గురువారం, 31 మే 2018 (11:16 IST)
ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భార్యామణులు అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. తమ ప్రియుడు లేదా పరాయి పురుషులపై మోజుపడి కట్టుకున్న భర్తలను కడతేర్చుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణా రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అలాంటి ఘటనలను ఓసారి పరిశీలిస్తే..
 
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ పట్టణంలో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య కడతేర్చింది. చనిపోయిన భర్త స్థానంలోకి తన ప్రియుడిని తీసుకురావడానికి ప్రయత్నించింది. చివరకు ఇది వికటించి ఆ ఇద్దరూ కటకటాలపాలయ్యారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనంగా మారింది.
 
విశాఖలో ఓ వివాహిత భర్తకు సైనేడ్ ఇచ్చి హతమార్చింది. ఆ తర్వాత తన భర్త తనను ఒంటరి చేసి చనిపోయాడని ఇరుగుపొరుగువారిని నమ్మించేందుకు ప్రయత్నించింది. తీరా పోలీసుల దర్యాప్తులో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తకు సైనేడ్‌ ఇచ్చి చంపినట్టు తేల్చారు. 
 
విజయనగరం జిల్లాలో ఇష్టంలేని పెళ్లి చేశారంటూ కిరాయి ముఠాతో భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించింది ఓ భార్య. ఆ తర్వాత తన భర్తను దారి దోపిడీ దొంగలు పొట్టనబెట్టుకొన్నారనే నాటకానికి తెరతీసింది. పోలీసుల విచారణలో అసలు నిందితురాలు ఆమేనని తేల్చారు. పెళ్లి ఇష్టం లేకపోవడం, ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడటం తదితర కారణాలతో కిరాయి మనుషులతో భర్తను చంపించినట్టు తేల్చారు. అప్పటికి వారిద్దరికీ పెళ్లయి 10 రోజులే అయింది.
 
శ్రీకాకుళం జిల్లాలో కూడా అచ్చం ఇలాంటి మర్డర్ ఒకటి జరిగింది. కాకపోతే ఇక్కడ వివాహమై 20 రోజులైంది. బైకుపై వెళుతూ అతని మెడపై భార్య కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించింది. కత్తిపోటుకు అతడు పెద్దగా కేకలు పెట్టి, ఆ దాడినుంచి తప్పించుకున్నాడు. పెళ్లి ఇష్టం లేకపోవడమే ఈ విపరీత ప్రవర్తనకు కారణమని పోలీసులు గుర్తించారు.
 
గుంటూరు జిల్లాలో రాత్రిపూట తాగొచ్చి నానా యాగీ చేస్తున్నాడని తాగుబొతు భర్తను రోకటిబండతో తల పగులగొట్టి చంపేసింది ఓ కసాయి భార్య. ఈ హత్య జిల్లాలోని కంతేరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పరారీలోని లక్ష్మి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు