తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సీ.ఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. పలువురు ప్రాంతీయ పార్టీ నాయకులను కెసిఆర్ కలవడం... వారందరూ కెసిఆర్‌కి సహకరిస్తామని చెప్పడం తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏం జరుగనుంది అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే... కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు.
ఢిల్లీలోనే నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఉంటారని సమాచారం. దీంతో కెసీఆర్ ఢిల్లీ పయనం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ నిమిత్తం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై కేంద్రంతో చర్చించనున్నారని తెలిసింది. కాగా, కొత్త జోనల్ విధానం, రైతు జీవిత బీమా పథకాన్ని తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 15 అంశాలతో అజెండాను రూపొందించారు.